Jawaharlal nehru biography in telugu analysis papers



భారత స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొని, దేశ తొలి ప్రధానమంత్రిగా సుధీర్ఘకాలం పనిచేసిన జవహార్ లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో జన్మించారు. పండిత్‌జీగా, చాచానెహ్రూగా ప్రసిద్ధి చెందిన ఈయన గాంధీ-నెహ్రూ కుటుంబంలో ప్రముఖుడు. దేశ ప్రధానిగా 17 సంవత్సరాలు పనిచేశారు. ఈయన వారసులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. మే 27, 1964న నెహ్రూ మరణించారు.

బాల్యం:
నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జన్మించిన జవహార్ లాల్ నెహ్రూ కాశ్మీరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. స్థానికంగా అలహాబాదులో అభ్యసించి న్యాయవాద విద్యకై ఇంగ్లాండు వెళ్ళినారు. స్వదేశం తిరిగివచ్చిన పిదప జాతీయోద్యమంలో ప్రవేశించి మహాత్మాగాంధీకి సన్నిహితులైనారు.

జాతీయోద్యమంలో:
భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో పాల్గొని నెహ్రూ పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా జాతీయోద్యమ నాయకుడు. జైలులో ఉన్నప్పుడే "గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ", "ది డిస్కవరీ అఫ్ ఇండియా" గ్రంథాలు రచించారు. 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. 1936, 1937 చివరిగా 1946 లలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడైనారు. జాతీయోద్యమంలో గాంధీజీ తర్వాత రెండో ప్రముఖ నాయకుడిగా అవతరించారు.

ప్రధానమంత్రిగా:
1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి నెహ్రూ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్ర్యానంతరం పూర్తిస్థాయి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి తొలి ప్రధానమంత్రిగా కీర్తి పొందారు. 1952, 1957, 1962లలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి మొత్తం 17 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. విదేశాంగ విధానంలో సోషలిజం వైపు మొగ్గి రష్యాకు చేరువైనారు. చైనాతో పంచశీల ఒప్పందం కుదుర్చుకొని ఖ్యాతిచెందిననూ 1962లో చైనాయుద్ధంలో భూభాగాన్ని కోల్పోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. అలీనవిధానం ప్రతిపాదించిన త్రిమూర్తులలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డారు.

గుర్తింపులు:
జవహార్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1955లో దేశపు అత్యున్నత అవార్డు అయిన భారతరత్న పురస్కారంప్రకటించబడింది. నెహ్రూ పేరుతో విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలు, పలు జాతీయ సంస్థలు ఉన్నాయి. నగరాలు, పట్టణాలలో నెహ్రూ విగ్రహాలు, నెహ్రూ పేరుతో కూడళ్ళు, వీధులు లెక్కకుమించి ఉన్నాయి.

గాంధీ-నెహ్రూ కుటుంబం:
భారత జాతీయోద్యమంలో నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా పాలుపంచుకున్నారు. మోతీలాల్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత కూడా వహించారు. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ1966-77 మరియు 1980-84 కాలంలో ప్రధానమంత్రిగా పనిచేయగా నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ కూడా 1984-89కాలంలో ప్రధానమంత్రి పదవి నిర్వహించారు. రాజీవ్‌గాంధీ భార్య సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి సుధీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేయగా, నెహ్రూ మునిమనవడి రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు.

ఇవి కూడా చూడండి .. 

 

 

హోం
విభాగాలు:భారతదేశ ప్రధానమంత్రులు, భారతరత్న అవార్డు గ్రహీతలుభారత స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలహాబాదు, 1889లో జన్మించినవారు, 1964లో మరణించినవారు, 1వ లోకసభ సభ్యులు, 2వ లోకసభ సభ్యులు, 3వ లోకసభ సభ్యులు,